- రాయదుర్గంలో ఇందిరమ్మ టవర్స్ నిర్మాణానికి నేడు
- మంత్రి పొంగులేటి శంకుస్థాపన
- హౌసింగ్ బోర్డు వైస్ చైర్మన్ వీపీ గౌతమ్ వెల్లడి
హైదరాబాద్, వెలుగు: హెచ్‌ఎండీఏ పరిధిలోని 16 నియోజకవర్గాల్లో ఇందిరమ్మ ఇండ్ల టవర్స్‌కు సంబంధించిన అలాట్‌మెంట్ లెటర్లను సోమవారం నుంచి లబ్ధిదారులకు అందజేయనున్నట్లు హౌసింగ్ బోర్డు వైస్ చైర్మన్ వీపీ గౌతమ్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎస్ఎంఎస్, వాట్సాప్ మరియు హౌసింగ్ బోర్డు వెబ్‌సైట్ ద్వారా వీటిని లబ్ధిదారులకు అందిస్తామని పేర్కొన్నారు. లబ్ధిదారులు తమ అలాట్‌మెంట్ లెటర్లను పొందేందుకు తెలంగాణ హౌసింగ్ బోర్డు అధికారిక వెబ్‌సైట్‌ను సంప్రదించాలని సూచించారు.
శేరిలింగంపల్లి నియోజకవర్గం రాయదుర్గంలో ఇందిరమ్మ ఇండ్ల టవర్స్ నిర్మాణ పనులకు సోమవారం గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి శంకుస్థాపన చేయనున్నట్లు ఆయన వెల్లడించారు. రాయదుర్గంలో మల్కం చెరువు వెనుక భాగంలో ఉన్న సుమారు 2.85 ఎకరాల తెలంగాణ హౌసింగ్ బోర్డు భూమిలో ఒక్కొక్కటి సుమారు 528 చదరపు అడుగుల విస్తీర్ణంతో 480 ఫ్లాట్లను నిర్మించనున్నట్లు వివరించారు.
రాయదుర్గంలో రికార్డు ధర..
రాయదుర్గం–నాలెడ్జ్ సిటీ ప్రాంతంలో భూములకు అత్యధిక ధరలు పలుకుతున్నాయని వీపీ గౌతమ్ తెలిపారు. ఈ ఏడాది టీజీఐఐసీ నిర్వహించిన వేలంలో రికార్డు స్థాయిలో భూములు అమ్ముడయ్యాయని గుర్తుచేశారు. ఆ మార్కెట్ ధరలతో పోలిస్తే, ఇందిరమ్మ ఇండ్ల ప్రాజెక్టు కోసం వినియోగిస్తున్న 2.85 ఎకరాల భూమి విలువ సుమారు రూ.752 నుంచి రూ.767 కోట్ల వరకు ఉంటుందని ఆయన వెల్లడించారు.
